ఇటీవల జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రతాని రామకృష్ణ గౌడ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా ఆరోసారి ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నాం. ఇండస్ట్రీలోని 24 విభాగాల నుంచి ఈ ఛాంబర్లో 16 వేల మంది సభ్యులున్నారు. సినిమా ఔట్డోర్ షూటింగ్ల సమయంలో సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చిన్న చిత్రాలకు రాయితీ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షులుగా ఏ.గురురాజ్, డి.కోటేశ్వరరావు, జి.వరప్రసాద్, జనరల్ సెక్రటరీలుగా జె.వి.ఆర్.విద్యాసాగర్, కాచం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా సోమిరెడ్డి, ఎం.బిందు, కోశాధికారిగా డా॥పి. ప్రకాష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా 12 మందిని ఎంపిక చేశారు. త్వరలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందని అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.