Prakash Raj | బెట్టింగ్ యాప్ కేసుకి సంబంధించి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ, ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ కు కూడా నోటీసులు పంపింది. ఈడీ అధికారుల నుంచి వచ్చిన సమన్ల మేరకు ప్రకాష్‌రాజ్ ఈ రోజు (బుధవారం, జూలై 30) విచారణకు హాజరు అయ్యారు. బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి కొద్ది సేపటి క్రితమే ప్రకాశ్ రాజ్ వచ్చారు. ఆయన ‘జంగిల్ రమ్మీ’ అనే బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన యాడ్‌లో నటించినట్టు చెబుతూ, అదే ఆధారంగా నోటీసులో ఆయన పేరు చేర్చినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది ఆకర్షితులై, భారీగా ఆర్థిక నష్టాలు మూటగట్టుకున్నారని, కొందరు తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు 36 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపినట్టు సమాచారం. వారి ప్రమోషన్ల వల్లే ప్రజలు బెట్టింగ్‌కు ఆకర్షితులయ్యారని, దానివల్ల మానసిక, ఆర్థిక దెబ్బతిన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, అదే సమయంలో ఈడీ కూడా తనదైన శైలిలో విచారణను కొనసాగిస్తోంది.
ఈ కేసులో ప్రకాష్‌రాజ్ విచారణ ఎలా సాగుతుందో, తదుపరి చర్యలు ఏలా ఉంటాయి అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ నటులకు ఈడి నోటీసులు పంపగా, రానా దగ్గుబాటి ఈ నెల 23న హాజరు కావల్సి ఉంది. పలు కారణాల వలన తర్వాత హాజరు అవుతానని చెప్పినట్టు సమాచారం. ఇక ప్రకాష్ రాజ్ ఈ నెల 30న హాజరు కాగా , మంచు లక్ష్మి ఆగస్ట్ 13న విచారణకు హజరు కావాలి అని ఈడి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.