Prakash Raj | నటీనటులను దేవుళ్లలా ఆరాధించే రంగం సినిమా రంగం. తమ అభిమాన హీరోల కోసం ప్రేక్షకులు కష్టనష్టాలను లెక్కచేయకుండా థియేటర్ల చుట్టూ తిరుగుతుంటారు. సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామునే లైన్లలో నిలబడి టికెట్లు కొని, ఖర్చుకు వెనుకాడకుండా సినిమాలు చూస్తారు. అభిమానులైతే మరింత ఉత్సాహంతో తమ హీరో సినిమా కోసం బట్టలు చించుకునే స్థాయికి కూడా వెళ్తుంటారు. అటువంటి ప్రేక్షకులే స్టార్లను సూపర్స్టార్లుగా, పాన్ ఇండియా స్టార్లుగా మార్చారన్నది ఎవరు కాదనలేని సత్యం. కోట్ల విలువైన భవంతులు, లగ్జరీ కార్లు, విదేశీ విహారాలు, సమాజంలో లభించే గౌరవ మర్యాదలు… ఇవన్నీ స్టార్లకు దక్కుతున్నాయంటే దానికి ప్రధాన కారణం సగటు సినీ ప్రేక్షకులే.
అయితే తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. సీఐటీయూ మహాసభల సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో, పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రకాష్‌రాజ్, సినిమాలు చూడకండి. ఎవడి వ్యాపారం వాడిది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. సినిమాలు చేసే వాళ్లు లేకపోతే తాను లేనని, కోట్ల పారితోషికాలు తీసుకునే స్టార్లు, దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకుల వల్లే ఈ స్థాయికి వచ్చారన్న లాజిక్‌ను ప్రకాష్‌రాజ్ మర్చిపోయారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో స్టార్ హీరోలే భయాందోళనకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ‘మేమున్నాం’ అంటూ థియేటర్లకు వచ్చి సినిమాలను నిలబెట్టింది తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే. విపత్కర పరిస్థితుల్లో కూడా సినిమాలకు కాసుల వర్షం కురిపించిన ఆడియన్స్, ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయని ప్రశ్నిస్తే “సినిమాలు చూడకండి” అనడం విడ్డూరంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకుల వల్లే పేరు, ఫేమ్, కోట్ల సంపాదన వచ్చిన ప్రకాష్‌రాజ్… ఆ ప్రేక్షకులే లేకపోతే ఇండస్ట్రీనే ఉండదన్న నిజాన్ని ఎలా మర్చిపోయారు? అంటూ నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. ప్రీమియర్ షోలకైనా, ఫస్ట్ డే థియేటర్లకు ప్రేక్షకులు రాకపోతే సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో అందరికీ తెలుసని, అలాంటి పరిస్థితిని తేలిగ్గా తీసుకుంటూ చేసిన ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.