Prakash Raj | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నాడు. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘వారణాసి’ కాన్సెప్ట్ వీడియోకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ విశేష స్పందన లభించింది. ఈ వీడియో ఇంటర్నేషనల్ ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా, హాలీవుడ్ మీడియా కూడా దీనిపై ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘వారణాసి’ చిత్రంలో తాను కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో, “వారణాసి సినిమా కోసం ఒక అద్భుతమైన షెడ్యూల్‌ను పూర్తి చేశాము. ఈ పాత్ర నాలోని నటుడి దాహార్తిని తీరుస్తోంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా మీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమాలో ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రవి తేజ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రాజమౌళి సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చిన్న పాత్రతోనే భారీ ఇంపాక్ట్ సృష్టించగల నటుడిగా పేరున్న ప్రకాష్ రాజ్, ‘వారణాసి’లో ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక రాజమౌళి–మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.