మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. ప్రకాష్‌రాజ్‌కు తొలి నుంచి మద్దతునిస్తూ వచ్చిన బండ్ల గణేశ్ ఆయన ప్యానల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. బండ్ల గణేశ్ నిర్ణయంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10న జరుగనున్న ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా తాను పోటీచేయబోతున్నట్లు బండ్ల గణేశ్ ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలే సినిమా బిడ్డల ప్యానల్‌ను ప్రకాష్‌రాజ్ ప్రకటించారు. ఈ ప్యానల్‌కు అధికారిప్రతినిధిగా బండ్ల గణేశ్ ఉంటారని ఆయన వెల్లడించారు. అయితే ఈ పదవికి వ్యక్తిగత కారణాల వల్ల తాను పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని బండ్ల గణేశ్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘గౌరవనీయులైన ప్రకాష్‌రాజ్‌గారు.. మీ ప్యానల్‌కు నన్ను అధికారప్రతినిధిగా నియమించినందుకు ధన్యవాదాలు. నా వ్యక్తిగత పనుల వల్ల ఈ పదవికి చట్టబద్ధంగా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నా. ఆ పదవికి ఇతరుల్ని తీసుకోగలరు’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘మాట తప్పను
మడమ తిప్పను. నాది ఒకటే మాట. ఒకటే బాట. నమ్మడం-నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. మనస్సాక్షికి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. ప్రస్తుతం పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే ‘మా’ సభ్యులు నమ్మరు’ అంటూ ట్విట్టర్లో బండ్ల గణేశ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి. ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి జీవితరాజశేఖర్ పోటీచేయడం నచ్చకనే బండ్ల గణేశ్ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆమెకు వ్యతిరేకంగానే జనరల్ సెక్రటరీగా పోటీచేస్తున్నట్లు సమాచారం. అయితే బండ్ల గణేశ్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని జీవితరాజశేఖర్ ప్రకటించారు.