Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల రామాయణం, దేశంలోని సామాజిక పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఒక ప్రైవేట్ ఈవెంట్లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి.రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చినవారని, దక్షిణాదిలో ఓ గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి పండ్లు తిన్నారని, ఆ విషయంపై వివాదం చెలరేగిందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు రామాయణ గాథను వక్రీకరించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.అదే విధంగా, ఒక మీడియా సమావేశంలో కూడా శ్రీరాముడు ఉత్తర భారతానికి చెందినవారని, రావణుడు దక్షిణ భారత తెగకు చెందినవాడని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పురాణ గాథలను తప్పుగా చూపిస్తూ, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. మతపరమైన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇక దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. మైనారిటీలు, గిరిజనులు, ముస్లింలపై ప్రమాదం ఉందని ఆయన చేసిన ఆరోపణలు ఆధారరహితమని కొందరు విమర్శిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు, సమాజంలో విద్వేషాలను ప్రేరేపించినందుకు గాను ఆయనపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికలపై ఆయనను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తూ, రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున స్పందన రాబడుతున్నాయి.