Pragya Nagra | యంగ్ బ్యూటీ ప్రజ్ఞా నగ్రా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవలో నటికి సంబంధించిన ఫొటోలు కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాల షేర్ చేసి.. ప్రైవేట్ వీడియో లీక్ అయ్యిందనే వార్త వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే వీడియో వ్యవహారంపై యంగ్ బ్యూటీ స్పందించింది. టెక్నాలజీ అనేది మనకు సాయం చేయాలే తప్పా.. జీవితాలను నాశనం చేయకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. వీడియో నిజం కాదని.. ఇదంతా ఓ పీడ కల అయితే బాగుండనిపిస్తోందన్నారు. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓ చెత్త వీడియో సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడింది. వరుసగా వస్తున్న ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని.. విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన వారికి రుణపడి ఉంటానని చెప్పింది.
తన పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని ప్రార్థిస్తున్నానని.. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా సూచించింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ పోలీస్, సైబర్ దోస్త్‌తో పాటు మహారాష్ట్ర సైబర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ప్రజ్ఞా నంగ్రా స్వస్థలం హరియాణాలోని అంబాల. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2022లో జీవా హీరోగా తమిళ చిత్రం ‘వరలారు ముక్కియం’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనే ఎన్4, మలయాళంలో నథికళిల్ సుందరి మూవీల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘లగ్గం’ మూవీలో అలరించింది. అమెజాన్ ప్రైమ్, అహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్నది. గతంలోనూ సోషల్ మీడియాలో నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే.