Pragathi | టాలీవుడ్లో అమ్మగా, అత్తగా, వదినగా… ఇలా అనేక రకాల సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన ప్రగతి, ఇటీవల సినిమాలకు కొంత దూరంగా ఉంటోంది. అందుకు కారణం ఆమెకి ఆఫర్స్ రాక కాదు, తాను మరో రంగంలో తన ప్రతిభను ప్రదర్శించడంపై పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రగతి, గత కొంతకాలంగా పవర్ లిఫ్టింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి, పలు జాతీయ–అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తోంది. మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ తన జోష్, కష్టపడి సాధించిన ఫలితాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 లో ప్రగతి పాల్గొని… ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలతో మొత్తం నాలుగు పతకాలు గెలుచుకుంది. ఈ అద్భుత విజయంతో ప్రగతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆమె సాధించిన ఈ ఫీట్‌పై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ప్రగతి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. గతంలో ఆమె జిమ్ లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టినప్పుడు… కొంతమంది అసభ్యంగా కామెంట్లు చేసి ట్రోల్ చేశారు. అయినా ప్రగతి ఆ నెగెటివిటీని పట్టించుకోకుండా, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి పని చేసింది. ఇది చూసి ఒక నెటిజన్ ఆమె గురించి పాజిటివ్‌గా పోస్ట్ షేర్ చేశాడు.
ఆ పోస్ట్‌ను చూసిన సింగర్ చిన్మయి శ్రీపాద ట్విట్టర్లో స్పందిస్తూ ఇలా రాసింది. “ప్రగతి గారి ఫొటోలకు అసభ్యకరమైన కామెంట్లు చేసినవారు వారి జీవితంలో ఏం సాధించారు? అలాంటివారు ఎప్పటికీ ఏం సాధించలేరు. అమ్మాయిలు… మీరు ప్రగతి గారిలా స్ఫూర్తి పొందండి. మీపై వచ్చే చెడు కామెంట్లను పక్కన పెట్టండి. అలాంటి మనుషుల కుటుంబాల్లోకి భవిష్యత్తులో వెళ్లకుండా జాగ్రత్త పడండి అని రాసుకొచ్చింది. చిన్మయి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆమె మాటలకు మద్దతు తెలుపుతున్నారు. ప్రగతి సాధించిన ఈ విజయంతో సినీ పరిశ్రమ నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా… అందరూ ఆమెను అభినందిస్తున్నారు.