Pragathi | టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని అలరించింది. తెలుగుతో పాటు ఇతర భాషలలోను నటించింది ప్రగతి. ఇప్పుడు ఈ సీనియర్ నటి కేవలం సినీ రంగంలోనే కాకుండా క్రీడలలోనూ తన ప్రతిభను చాటుతూ అందరికీ ఆదర్శంగా మారుతున్నారు. ఇటీవల ఆమె పవర్‌లిఫ్టింగ్ లోనూ భారీ విజయాలు సాధిస్తున్నారు. 2024లో జరిగిన సౌతిండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన ఆమె, ఇప్పుడు 2025లో కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా మరో రెండు విభాగాల్లోనూ మెడల్స్ సాధించారు.
స్క్వాట్ 115 కిలోలు, బెంచ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్‌లిఫ్ట్ 122.5 కిలోలు ఈ కేటగిరీల్లో పోటీలో పాల్గొన్నారు ప్రగతి. మొత్తంగా మూడు మెడల్స్ గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది. తన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రగతి తన సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అభిరుచి, క్రమశిక్షణ వంటివి మాత్రమే దీనికి అవసరం. నా ప్రియమైన వారందరికీ టన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ లేదు. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా కోచ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. @kaushik_powerlifting జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీ 2025లో బంగారు పతకం అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చింది ప్రగతి.
ప్రగతి 50 ఏళ్ల వయసులోనూ ఇలా తన శరీర ధారుడ్యాన్ని నిరూపించుకుంటూ, క్రీడా రంగంలో గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా అందరికీ ప్రేరణగా నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులు, సహచరులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . రియల్లీ గ్రేట్! ”, “ హ్యాట్సాఫ్! ” అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పతకాలు ప్రగతి ఎన్నో సాధించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. గతంలో మాదిరిగా ప్రగతి ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఏదో అడపాదడపా మెరుస్తుంది. కరోనా సమయం నుండి ప్రగతి వర్కవుట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.