అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మూడు పాటలు మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నాయని తెలిసింది. ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లో వేసే భారీ సెట్లో ప్రభాస్‌పై ఓ పాటను తెరకెక్కించబోతున్నారని సమాచారం.
ఇది పూర్తయ్యాక రెండు పాటల్ని గ్రీస్‌లో తెరకెక్కిస్తారట. అక్టోబర్ ప్రథమార్థం కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహిస్తూనే ప్రచార కార్యక్రమాల్ని కూడా ముమ్మరం చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్నందిస్తున్నారు.