Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ తన పాత్ర కోసం బాడీ డబుల్‌ను అసలు ఉపయోగించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.సినీ పరిశ్రమలో ప్రమాదకరమైన స్టంట్స్, అత్యంత రిస్క్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాలు లేదా శారీరకంగా కష్టమైన షాట్ల కోసం బాడీ డబుల్స్‌ను ఉపయోగించడం సర్వసాధారణం. ముఖ్యంగా భారీ యాక్షన్ చిత్రాల్లో హీరోలకు ప్రత్యామ్నాయంగా డూప్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఇటీవల ప్రభాస్ నటించిన కొన్ని సినిమాల్లో కూడా బాడీ డబుల్స్ వాడారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ‘స్పిరిట్’ విషయంలో మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సాధారణంగా తన సినిమాల్లో బాడీ డబుల్స్‌ను ఉపయోగించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపరని చెప్పారు. అదే విధానాన్ని ‘స్పిరిట్’లోనూ కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ‘స్పిరిట్’లో ప్రభాస్‌కు బదులుగా ఒక్క షాట్లో కూడా బాడీ డబుల్ కనిపించదని ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, ముఖ్యంగా రిస్క్‌తో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ప్రభాస్ స్వయంగా చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ చూపిస్తున్న అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. పాత్ర కోసం అవసరమైనప్పుడు ప్రభాస్ రోజుకు ఏకంగా 18 గంటల వరకు షూటింగ్లో పాల్గొంటూ కష్టపడుతున్నారని వెల్లడించారు. వరుస భారీ చిత్రాలతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తున్నారని తెలిపారు.
‘స్పిరిట్’ షూటింగ్ ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయినట్లు ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. చిత్రబృందం ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే షూటింగ్ కొనసాగుతోందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్స్ యాక్షన్, ప్రభాస్ స్టార్ పవర్ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ను ఏ స్థాయిలో చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రణయ్ రెడ్డి వంగా ధృవీకరించారు. అయితే విడుదల తేదీకి సంబంధించిన తదుపరి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.