దేశవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. ‘బాహుబలి ఫ్రాంచైజీ’, సలార్ సినిమాల తర్వాత ఆయన ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు చేరుకుంది. ఈ నెల 27న ‘కల్కి 2898’గా రాబోతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆ సినిమాకోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నది. అంతేకాదు, ఈ సినిమా తర్వాత కూడా ఆయనకు చాలా కమిట్మెంట్లున్నాయి. అయినా సరే.. ‘టీ సిరీస్’ యాజమాన్యం ఆయనకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చేశారట.
ఫిల్మ్‌వర్గాల్లో ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చ నడుస్తున్నది. ‘టీ సిరీస్’ గతంలో ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ తీశారు. ఆ సినిమా దారుణమైన ఫ్లాప్‌ని మూటగట్టుకున్నా, ముందుగానే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసుకోవడంవల్ల ‘టీ సిరీస్’ వాళ్లు మాత్రం లాభాలతోనే బయటపడ్డారు. అందుకే, ఈ సారి ప్రభాస్‌తో సరైన సినిమా చేయాలనే కసితో ఉన్నారట టీ సిరీస్ యాజమాన్యం.
ప్రభాస్కోసం ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఓ కథ కూడా రెడీ చేశారు. ప్రభాస్ ఓకే అంటే, షూట్‌కి వెళ్లిపోడానికి రెడీగా ఉన్నారట టీ సిరీస్. కానీ ప్రభాస్‌కు ఓకే అనే పరిస్థితి లేదు. ఆయన ‘కల్కి 2898’ విడుదలకు సిద్ధమైంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమా కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ‘సలార్- శౌర్యాంగపర్వం’ షూటింగ్ మొదలైంది. ఇంకోవైపు అను రాఘవపూడి చెప్పిన పీరియాడిక్ కథకు కూడా ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఇవన్నీ పూర్తవ్వాలంటే రెండేళ్లు పట్టడం ఖాయం. దీన్ని బట్టి చూస్తే టీ సిరీస్ వాళ్లు ఓ రెండేళ్ల ఆగక తప్పదు.