Prabhas |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సీతా రామం” ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా స్వాతంత్య్రం మునుపటి కాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇమాన్వీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు “ఫౌజీ” అనే టైటిల్ పెట్టనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నా, నిర్మాతలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయితే తాజాగా నటుడు ప్రదీప్ రంగనాథన్ తన రాబోయే సినిమా “డూడ్” ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడుతూ మూవీ టైటిల్‌ని అనుకోకుండా రివీల్ చేసాడు.
ప్రదీప్ మాట్లాడుతూ.. నేను ఇది చెప్పొచ్చో, లేదో నాకు తెలియదు. మా నిర్మాతలు నాకు ప్రభాస్ సర్ సినిమా ‘ఫౌజీ’ కొన్ని క్లిప్పింగ్‌లు చూపించగా, అది చూసి చాలా అద్భుతంగా ఉంది అని అన్నాను. నవీన్ సర్, రవి సర్ లాంటి నిర్మాతలు చాలా ప్యాషనేట్ ఉన్న నిర్మాతలు అంటూ మాటల్లో మూవీ పేరు ఫౌజీ అని చెప్పడంతో టైటిల్ చెప్పేసానా? (నవ్వుతూ)” అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రదీప్ రంగనాథన్ చెప్పిన ఈ మాటలతో ప్రభాస్ మూవీకి “ఫౌజీ” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టున్నారుగా అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ వ్యాఖ్యలతో ఈ వార్తకు బలం చేకూరినట్టైంది.
ఇక ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి అంశాలు మిళితమై ఉండే ఈ కథలో ప్రభాస్ కొత్తగా కనిపించనున్నాడని టాక్. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో, సైనికుడిగా ప్రభాస్ శక్తివంతమైన పాత్ర పోషించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ చేతిలో కల్కి 2898 ఎ.డి., సలార్ పార్ట్ 2 తో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో, “ఫౌజీ” కూడా అదే స్థాయిలో క్రేజ్‌ను పొందే అవకాశం ఉంది. ఇక, ప్రదీప్ రంగనాథన్ చేసిన వ్యాఖ్యలపై మైత్రీ మూవీ మేకర్స్ నుండి ఎలాంటి స్పందన లేకపోయిన, త్వరలో అధికారికంగా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.