Prabhas | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తను ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమాల షూటింగ్ పూర్తి చేస్తూనే మరోవైపు గెస్ట్ రోల్లో కూడా కనిపించి అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంలో టాలీవుడ్, బాలీవుడ్, మలయాళం, తమిళ ఇండస్ట్రీలకు చెందిన అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రాచీన భారతీయ కన్నప్ప కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మంచు విష్ణు.
‘కన్నప్ప’ మూవీ మొత్తం రన్ టైం 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని చెప్పిన విష్ణు.. ‘ప్రభాస్‌ను మొదట గెస్ట్ రోల్ కోసం తీసుకున్నాం అని అన్నారు. ఆ తర్వాత 30 నిమిషాలు పెంచాం. ‘కన్నప్ప’లో చివరి 50 నిమిషాలు ఆయన కనిపించి అలరిస్తారు. ఇక మోహన్ బాబు, ప్రభాస్ మధ్య సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మోహన్ లాల్ రోల్ 15 నిమిషాలు, శివుడిగా అక్షయ్ కుమార్ 10 నిమిషాలు స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. ఇప్పటివరకూ నా కెరీర్లో ఇంత భారీ సినిమా చేయలేదు అని విష్ణు స్పష్టం చేశారు. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు టెక్నికల్ స్టాండర్డ్స్ ని అమలు చేస్తున్నారు.
సినిమాలో రుద్ర అవతారంలో ప్రభాస్ కనిపించి సందడి చేయనున్నాడు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, లుక్స్ ఆకట్టుకోగా.. మరో కొత్త పాటను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. శ్రీకాళ హస్తి అనే పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఆలపించగా, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు. చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.ఈ ప్రాజెక్ట్ తెలుగు ఇండస్ట్రీలో అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కొన్నేళ్లుగా ఒక్క మంచి హిట్ కూడా అందుకోలేకపోయిన విష్ణు ఈ మూవీతో అయిన సక్సెస్ సాధిస్తాడా చూడాలి.