The Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’పై ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా (USA)లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అసాధారణంగా ఉంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్స్‌కు సంబంధించి సుమారు నెల రోజుల ముందే యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన వెంటనే ‘ది రాజా సాబ్’ ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే లక్ష డాలర్ల మార్క్‌ను దాటిపోయి దూసుకుపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విడుదల తేదీకి ఇంకా నెల రోజులు సమయం ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ లెక్కలు ప్రభాస్ ఓవర్సీస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి.
ఈ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా, త్వరలోనే రెండో పాటను రిలీజ్ చేసి మరింత జోష్ పెంచనున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.