ఎట్టకేలకు రాజాసాబ్ ఆగమనానికి రంగం సిద్ధమైంది. వచ్చే జనవరి 9న ‘ది రాజాసాబ్’ని విడుదల చేయనున్నట్టు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విలేకరుల సాక్షిగా ప్రకటించారు. దీంతో డార్లింగ్ అభిమానుల్లో సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. ఇక దర్శకుడు మారుతి ఈ తరహా సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని అందరికీ తెలిసిందే. దానికితోటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్.. ముగ్గురు అందాలభామలు.
మరోవైపు సంజయ్‌దత్.. ఇన్ని ప్రత్యేకతలతో వస్తున్న ‘ది రాజాసాబ్’ అసలు సిసలు సంక్రాంతి సినిమా అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సంజయ్‌దత్ ఇందులో భూతంగా కనిపిస్తారని సమాచారం. ప్రభాస్, సంజయ్‌దత్ కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్‌ని కడుపుబ్బ నవ్విస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇదిలావుంటే.. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కూడా వచ్చే సంక్రాంతికే రానుంది. అలాగే.. దళపతి విజయ్ ‘జననాయకుడు’ కూడా అదే డేట్లో రానున్నదని సమాచారం. దీనిబట్టి చూస్తే.. రేపు సంక్రాంతి జాతర సామాన్యంగా ఉండదు.