కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ప్రభాస్ ‘స్పిరిట్’ ఆడియో గ్లింప్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘నాకో బ్యాడ్ హాబిట్ ఉంది’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. సౌండ్స్టోరీ పేరుతో విడుదల చేసిన ఈ ఆడియో గ్లింప్స్‌తోనే ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో హింట్ ఇచ్చారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఈ సినిమాలో ప్రభాస్ ధిక్కార స్వభావి అయిన పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఇప్పటివరకు తెలుగు సినిమాలో రానటువంటి సరికొత్త ట్రీట్మెంట్తో ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సినిమా అప్డేట్ను అందించారు. ఈ నెలాఖరులో ‘స్పిరిట్’ను సెట్స్‌మీదకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సినిమాను పర్ఫెక్ట్ స్క్రిప్ట్, పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు పేరుంది. ‘స్పిరిట్’ చిత్రాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకులముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.