Prabhas-Siddharth anand Movie | ప్రభాస్ లైనప్‌లో మరో సినిమా చేరింది. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా గడుపుతున్న డార్లింగ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది. ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు సమయం తీసుకున్న ప్రభాస్, ఆ తర్వాత ‘సాహో’ కోసం రెండేళ్లు, ‘రాధేశ్యామ్’ కోసం మూడేళ్లు టైమ్ తీసుకున్నాడు. ఇలా ఏళ్లకు ఏళ్లకు ఒక్కో సినిమా కోసం కేటాయించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడుతున్నారు. ఒకవేళ అవి హిట్టయినా అభిమానులు సంతోష పడేవాళ్లేమో. పర్లేదులే టైమ్ తీసుకున్నా మంచి సినిమాలతో వస్తున్నాడుగా అని వాళ్లలో వాళ్లు సర్దిచెప్పుకునే వారు.
కానీ ‘బాహుబలి’ తర్వాత వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఓ వైపు అభిమాన హీరో సినిమాలు రాక, ఒకవేళ వచ్చిన అవి కాస్త డిజాస్టర్లు అవడం డార్లింగ్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపడుతున్నాయి. ఈ క్రమంలో అభిమానుల కోరిక మేరకు ప్రభాస్ వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇక అవి సెట్స్ పైన ఉండగానే ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని, ప్రభాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే అన్‌స్టాపబుల్ టాక్‌షోకు గెస్ట్‌గా వచ్చిన నవీన్.. ప్రభాస్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే, ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కంచనున్నట్లు తెలిపాడు. దాంతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘పఠాన్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. షారుఖ్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే బాకీ ఉంది. జూన్‌లో సినిమాను పక్కాగా రిలీజ్ చేస్తామని మేకర్స్ నుండి క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక ‘సలార్’ ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలుందని టాక్. అది కూడా వచ్చే నెలలోపు పూర్తయిపోతుందని సమాచారం. ఆ తర్వాత పోస్ట్ పోడక్షన్ పనులలో నిమగ్నమైతుంది. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని గతేడాది చిత్రయూనిట్ ప్రకటించింది.
ఇక పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్-K’ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలు పూర్తి కాగానే సందీప్ వంగాతో ‘స్పిరిట్’ను పట్టాలెక్కించనున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సందీప్ యానిమల్తో బిజీగా ఉన్నాడు. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సందీప్ స్పిరిట్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. ఇలా నాలుగు భారీ ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే దాదాపు మరో మూడేళ్లు సమయం పడుతుంది.