Raja Saab | ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొని ఉంది. మే 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పాటలపై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఒక్కో పాటను ప్రత్యేకమైన థీమ్‌తో తీర్చిదిద్దబోతున్నట్లు తెలిసింది.
కథానుగుణంగా చక్కటి మెలోడీస్‌తో పాటు మాస్ సాంగ్స్‌కు కూడా చోటుందట. భారీ హంగులతో, వైవిధ్యమైన కొరియోగ్రఫీతో, ప్రపంచంలోని అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ప్రభాస్ స్వల్పంగా గాయపడటంతో షూటింగ్‌కు విరామం తీసుకుంటున్నారు.
త్వరలో ఆయన సెట్లోకి అడుగుపెడతారని, మార్చిలోగా సినిమాను పూర్తి చేసే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తున్నదని చెబుతున్నారు. హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.