పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రేజీ మూవీలో ఒక కీలకమైన పాత్రలో బాలీవుడ్ దిగ్గజ నటుడు బొమన్ ఇరానీ నటిస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలోని ఆయన గెటప్‌ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా బొమన్ కనిపించనున్నారని దర్శకుడు తెలిపారు. హారర్ కామెడీ జానర్లో ‘ది రాజాసాబ్’ ఎవర్గ్రీన్ మూవీగా నిలిచిపోతుందని, భారీ నిర్మాణ విలువలతో రాజీ అనే పదానికి తావులేకుండా ఈ సినిమాను నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.