Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వెలువడింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌లు అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్లో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్దికుమార్ నటిస్తున్నారు.ఇదివరకు ఈ సినిమాను డిసెంబర్ 5, 2025న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం మేరకు సినిమా విడుదల వాయిదా పడింది.
‘మిరాయ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందిస్తూ, “ది రాజా సాబ్ షూటింగ్ ప్రస్తుతం కొంత వెనుకబడింది. కొన్ని సన్నివేశాల షూట్ ఇంకా పెండింగ్‌లో ఉంది. దర్శకుడు మారుతి ఎంతో శ్రమిస్తున్నాడు. షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే మా ప్లాన్” అని తెలిపారు. ఈ వాయిదా సమాచారం అభిమానులను కొద్దిగా నిరాశపరిచినప్పటికీ, మరోవైపు సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందన్న వార్త వారు ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఇక వచ్చే సంక్రాంతికి ఇప్పటికే పలు భారీ చిత్రాలు బరిలోకి దిగనున్న నేపథ్యంలో, ప్రభాస్ సినిమా ఏ స్థాయిలో పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ప్రభాస్.. ది రాజా సాబ్ చిత్రంతో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ అనే వార్ డ్రామాలో, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఉన్న స్పిరిట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా షూటింగ్ దశలో ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా స్పిరిట్ షూటింగ్ ఈ రెండు ప్రాజెక్టుల వల్ల వాయిదా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి… ‘ది రాజా సాబ్’ రిలీజ్ డేట్ మారినప్పటికీ, సంక్రాంతి రేస్‌లో ప్రభాస్ అడుగు పెట్టనున్న వార్తతో ఫ్యాన్స్ మళ్లీ బూస్టప్ అవుతున్నారు. మరోవైపు సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం విడుదల కానుంది. వర్షం తర్వాత చిరు, ప్రభాస్ తిరిగి బాక్సాఫీస్ దగ్గర పోటీపడబోతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.