Mahavatar Narsimha | హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయిన తర్వాతి రోజు సైలెంట్‌గా థియేటర్స్‌లోకి వచ్చి కేవలం మౌత్ టాక్‌తో భారీ కలెక్షన్స్ సాధిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ. 50 ఏళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ మూవీ “భక్త ప్రహ్లాద” తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శ్రీ మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుని జీవితం ఆధారంగా రూపొందిన ఆ చిత్రం, అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎస్వీ రంగారావు హిరణ్యకశిపుడిగా, అంజలీదేవి ప్రహ్లాదుని తల్లిగా, తరుణ్ మదర్ రోజారమణి ప్రహ్లాదుడిగా నటించిన ఈ చిత్రానికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. మెయ్యప్పన్ నిర్మించిన ఈ చిత్రం ప్రహ్లథుడి కథకు సినిమాటిక్ రిఫరెన్స్‌గా నిలిచిపోయింది.
అయితే, ఇప్పుడు ఆ గొప్ప కథను ఆధునిక సాంకేతికతతో, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది హోంబలే ఫిల్మ్స్. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు చేయనున్న నేపథ్యంలో మరో నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్ తో చేతులు కలిపింది హోంబలే. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం మహావతార్ నరసింహ కాగా, ఇది బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపిస్తుంది. ఈ 3D యానిమేషన్ మూవీలో మొదటి నలభై నిమిషాలు, చివరి అరగంట భారీ ఎమోషనల్ హైలైట్‌గా నిలుస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
థియేటర్లలో ఈలలు, కేకలతో సందడి మామూలుగా లేదంటూ రివ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. సినిమా లోని గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రపంచ స్థాయిలో ఉందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. పురాణాలను ఆధునిక తరం పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నంగా ఈ మూవీ నిలుస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రభాస్ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. పవర్ ఫుల్ విజన్‌తో మహావతార నరసింహ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హోంబలే ఫిల్మ్ కి శుభాకాంక్షలు. సినిమా చాలా బాగుంది.యాక్షన్ సన్నివేశాలు, యానిమేషన్ రూపంలో తీర్చిదిద్దిన సన్నివేశాలు అద్భుతం. దర్శకుడు అశ్విన్ కుమార్, చిత్ర బృందానికి నా అభినందనలు అని పేర్కొన్నారు. ప్రభాస్ ఈ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేసినందుకు హోంబలే చిత్రబృందం కృతజ్ఞతలు తెలియజేసింది.