Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్ అందించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న కొత్త యానిమేషన్ ప్రాజెక్ట్ ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’కు సంబంధించిన కీలక అప్డేట్ను ప్రభాస్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యానిమేషన్ రూపంలో ప్రభాస్ యోధుడి అవతారంలో కనిపించడం అభిమానులకు గూస్బంప్స్ కలిగిస్తోంది. ‘బాహుబలి’ ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక యానిమేషన్ ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఫ్రాన్స్‌లోని ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ఎంపిక కావడం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. ఈ ఫెస్టివల్లో నిర్వహించే ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ సెషన్లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యానిమేషన్ రంగానికి చెందిన ప్రముఖులు, స్టూడియోలు, నిర్మాతలు, దర్శకుల సమక్షంలో ఈ ప్రాజెక్ట్ ప్రదర్శించబడనుండటం విశేషం. ప్రభాస్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆయన చేసిన పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైక్స్, వేలాది కామెంట్లను సొంతం చేసుకుంది.
ఈ యానిమేషన్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ యానిమేషన్ దర్శకుడు ఇషాన్ శుక్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ తన పోస్ట్‌లో .. బాహుబలి: ది ఎటర్నల్ వార్ ప్రాజెక్ట్ అన్నెసీ యానిమేషన్ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ నిజంగా అద్భుతమైన పనిని చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచం ఎప్పుడెప్పుడు చూస్తుందా అని నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు. ‘బాహుబలి’ మరియు ‘బాహుబలి 2’ చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులను సృష్టించాయి. ప్రభాస్‌ను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టిన ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు యానిమేషన్ రూపంలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.