ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు నాగ్అశ్విన్ ‘కల్కి-2’ విడుదల గురించి సరదాగా వ్యాఖ్యానించారు. ‘కల్కి-2’ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ “కల్కి’ చిత్రాన్ని 3,4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశాను. సీక్వెల్‌ను 7,8 గ్రహాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా. మీరంతా కాస్త వేచి చూడండి’ అంటూ సరదాగా స్పందించారు.
ప్రస్తుతం ‘కల్కి-2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని, ఈ సంవత్సరాంతంలో సెట్స్‌పైకి వెళ్తుందని, భైరవ, కర్ణ పాత్రల కోణంలోనే సీక్వెల్ సాగుతుందని తెలిపారు. ‘కల్కి’ చిత్రీకరణలోనే ‘కల్కి-2’కు సంబంధించిన కొంత భాగాన్ని షూట్ చేశామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.