Prabhas | ఫాంటసీ హారర్ జానర్లో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభాస్ అభిమానులకు కొంత నిరాశ తప్పలేదు. అయినా సరే, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ తదుపరి ప్రాజెక్టులపై మాత్రం భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలపై ఫ్యాన్స్ బలమైన నమ్మకం పెట్టుకున్నారు. ‘ది రాజా సాబ్’ ప్రమోషన్స్ కారణంగా కొంతకాలం ‘స్పిరిట్’ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత షూటింగ్ మళ్లీ పట్టాలెక్కినా, ఇప్పుడు ప్రభాస్ షెడ్యూల్స్ విషయంలో కొత్త చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభాస్ తీసుకున్న తాజా నిర్ణయం దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిందట.
‘స్పిరిట్’ కథకు ప్రభాస్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు కొంత సమయం పట్టింది. దానికి కారణం సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ప్రత్యేక అభ్యర్థన. ‘సాహో’ తర్వాత ప్రభాస్ ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఒక నెలలో కొన్ని రోజులు ఒక సినిమా, మిగతా రోజులు మరో సినిమా అంటూ డేట్స్ అడ్జస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ‘స్పిరిట్’ విషయంలో మాత్రం అలా వద్దని, షూటింగ్ సమయంలో మరొక సినిమా చేయకుండా లుక్, క్యారెక్టర్ కంటిన్యుటీ ఉండాలని వంగా కోరారట. అందుకే ప్రభాస్ అప్పట్లో సెట్స్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసి, స్పిరిట్‌పై ఫోకస్ పెట్టారని టాక్.
అయితే తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ పూర్తయ్యే వరకు ఆగకుండా ప్రభాస్ మరో సినిమా షూటింగ్‌కు డేట్స్ ఇచ్చారట. అదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ షూటింగ్‌కు ప్రభాస్ హాజరవుతారని సమాచారం. అంటే స్పిరిట్ షూటింగ్ మధ్యలోనే కల్కి సీక్వెల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి మొదటి రెండు వారాలు – కల్కి 2 షూటింగ్, ఫిబ్రవరి 15 తర్వాత – మళ్లీ స్పిరిట్ షూటింగ్ .. ఇలా రెండు వారాలు ఒక సినిమా, రెండు వారాలు ఇంకో సినిమా అంటూ ప్రభాస్ షెడ్యూల్ సెట్ చేసుకున్నారని ఇండస్ట్రీ గుసగుస. దీంతో మొదట వంగా కోరిన సింగిల్ ఫిల్మ్ ఫోకస్ ప్లాన్ మారిపోయిందని, అదే ఆయనకు షాక్‌గా మారిందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైన ప్రభాస్ మళ్లీ వరుసగా షూటింగ్స్‌లో పాల్గొనడం అభిమానులకు మాత్రం సంతోషాన్ని ఇస్తోంది. ఇప్పటికే ‘సలార్ 2’ (ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో) కూడా లైనప్‌లో ఉంది.