చిన్న సినిమా చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యానికి లోనుచేస్తున్నారు ప్రభాస్. ఆయన ‘కల్కి 2898’ ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే మారుతి ‘రాజా సాబ్’ సినిమాను కూడా మధ్యమధ్యలో కానిచ్చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ కూడా సగంపైన పూర్తయింది. ‘కల్కి 2898’ తర్వాత పూర్తిగా ‘రాజా సాబ్’వైపే దృష్టిపెడతారట. ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ ‘సలార్ సౌర్యాంగపర్వం’ ఎలాగూవుంది.
ఈ సినిమా షూటింగ్‌ను ప్రశాంత్‌నీల్ ఎప్పుడు షురూ చేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలావుంటే ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు వినిపిస్తున్నది. దర్శకుడు హను రాఘవపూడి కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వింటేజ్ ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ కొంతభాగం సైనికుడిగా కనిపిస్తారట. ఈ సినిమాకు సంబంధించిన ఫొటో షూట్‌ని కూడా త్వరలోనే నిర్వహించనున్నారు హను రాఘవపూడి. విశాల్ చంద్రశేఖర్ ప్రస్తుతం బాణీలు కట్టే పనిలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా మీద సినిమా చేస్తూ తోటి హీరోలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రభాస్.