ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898’ చిత్రం గత ఏడాది జూన్‌లో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లతో చరిత్ర సృష్టించింది. భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ కథాంశంతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలావుండగా ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. తొలిభాగం షూటింగ్ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌ను కూడా చిత్రీకరించారు.
రెండో భాగం తాలూకు 25శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత అశ్వనీదత్ గతంలో వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం జూన్ నుంచి ‘కల్కి-2’ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారని తెలిసింది. ఇందులో ప్రభాస్‌తో పాటు కీలక తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘స్పిరిట్’ ఏప్రిల్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.