Prabhas | ‘కల్కి 2898ఏడీ’తో వెయ్యికోట్ల మైలు రాయిని దాటేసి, రికార్డుల్ని వేటాడే పనిలో ఉన్నారు ప్రభాస్. వసూళ్ల పరంగా ఇంకా ‘కల్కి’ స్పీడులోనే ఉంది. మరి ఈ వేటకు పుల్‌స్టాప్ ఎక్కడ పడుతుందో తెలియాలి. ఇదిలావుంటే.. ప్రభాస్ తాజా సినిమాకు సంబంధించిన క్రేజ్ అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. ‘సీతారామం’ఫేం అను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో దర్శకుడు అను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. ఇందులో కథానాయికగా మృణాళ్ఠాకూర్ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.