చిరంజీవి, బాలకృష్ణ పిరియడ్‌లో వాళ్లు చేస్తున్న రెండుమూడు సినిమాలు ఒకేటైమ్‌లో సెట్లో ఉండేవి. ఒక సెట్లో వాళ్లుంటే, ఒక సెట్లో వాళ్లు లేని సన్నివేశాలు తీస్తుండేవాళ్లు డైరెక్టర్లు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా షెడ్యూల్స్ కూడా అచ్చంగా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’ సెట్లో ఉన్నారు. మరోవైపు ‘కల్కి 2’ సినిమాకు సంబంధించి తీయాల్సిన సన్నివేశాల కోసం కసరత్తులు జరుగుతున్నాయి.
ఇంకోవైపు తమిళనాడు మధురైలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా తొలి షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ లేని సన్నివేశాలను హను చిత్రీకరిస్తున్నారు. ఓ వారం రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుందని సమాచారం. ఇలా మూడు సినిమాల వర్క్ ఒకేసారి కానిచ్చేస్తున్నారు ప్రభాస్. ఈ జనరేషన్లో ఇది ప్రభాస్‌కి మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు.
ఇక హను రాఘవపూడి సినిమా విషయానికొస్తే.. ఇది 1945 నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటో షూట్ కూడా మేకర్స్ నిర్వహించారని తెలిసింది. దీనికి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా సిద్ధం చేశారట. దసరాకు ఆ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రభాస్ తండ్రిగా మిథున్చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగమ్మాయి ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్.