అగ్ర కథానాయకుడు ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్లో ఊహించని పరిణామం చోటు చేసుకున్నది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు రాజేశ్ శర్మ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. వివరాల్లోకెళ్తే.. బుధవారం షూటింగ్ ముగియగానే టెక్నీషియన్స్‌తో నటుడు రాజేశ్ శర్మ పిచ్చాపాటీ మాట్లాడుతూ నిలబడ్డారు. అది దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతం కావడంతో ఒక విషపూరితమైన కీటకం అతని కాలుపై కుట్టింది. దాన్ని రాజేశ్‌వర్మ పెద్దగా పట్టించుకోలేదు.
అయితే.. ఆరు గంటల తర్వాత కాలిలో తీవ్రమైన అసౌకర్యం మొదలై క్రమంగా నొప్పిగా మారింది. ఆ బాధతోనే ఆయన కోల్‌కతా విమానం ఎక్కారు. ప్రయాణం మధ్యలో రాజేశ్ శర్మకు విపరీతమైన జ్వరం రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోల్‌కతా చేరగానే ఆయన్ని హుటాహుటిన స్థానిక దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం రాజేశ్‌శర్మ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ప్రమాదం నుంచి ఇంకా పూర్తిగా బయట పడలేదని తెలిసింది. ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. హెల్త్ బులెటెన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.