TheRajaSaab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫలితం పట్ల అసంతృప్తిగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఇప్పుడు దర్శకుడిని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ.. “ఒకవేళ సినిమా బాలేకుంటే కొండాపూర్‌లోని కొల్ల లగ్జరీలో ఉన్న నా ఇంటికి వచ్చేయండి, అక్కడే మాట్లాడుకుందాం” అంటూ సరదాగా సవాల్ విసిరారు. దర్శకుడు అన్న ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్న కొంతమంది ప్రభాస్ అభిమానులు ఆయనను కలిసేందుకు నేరుగా ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన అభిమానులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మారుతి ఇంటి అడ్రస్‌ను ఉపయోగిస్తూ జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో పాటు, జెప్టో వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో వందలాది ఆర్డర్లు పెడుతున్నారు. వాటన్నింటినీ ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) ఆప్షన్‌తో బుక్ చేసి పంపిస్తుండటంతో, డెలివరీ బాయ్స్‌ను వెనక్కి పంపడం సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ వింత నిరసనలపై దర్శకుడు మారుతి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.