Kalki 2898 AD | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రచార పర్వంలో వేగాన్ని పెంచారు. పాన్ ఇండియా రేంజ్లో భారీ ప్రమోషన్స్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించే వాహనం బుజ్జిని కొద్ది రోజుల క్రితం పరిచయం చేయగా సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో తీసుకొచ్చిన యానిమేటెడ్ సిరీస్‌కు కూడా మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ టూ ఛేంజ్’ అనే క్యాప్షన్‌తో పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికాపడుకోన్ వంటి అగ్ర తారలు భాగం కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.