Prabhas | పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి స్పందన తెచ్చుకోగా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి రిద్ధి కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టేజీపై మాట్లాడుతూ ‘ది రాజా సాబ్’ ఒక సంపూర్ణ ఎంటర్టైనర్ అని, ప్రభాస్‌ను ఆయన సహజ స్వభావంతో, స్వీట్హార్ట్లా చూపించినందుకు దర్శకుడు మారుతికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభాస్‌లోని అన్ని కోణాలను బయటకు తీసుకురావడంలో మారుతి అద్భుతంగా పనిచేశారని ఆమె ప్రశంసించారు.
అనంతరం ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెబుతూ, తాను ఈ ఈవెంట్‌కు కట్టుకున్న తెల్ల చీరను ప్రభాస్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, ప్రత్యేకంగా ఈ రోజు కోసం మూడేళ్లుగా దాచుకున్నానని చెప్పడం మరింత చర్చకు దారితీసింది. అంతేకాదు, ప్రభాస్ తన జీవితంలో ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నానని రిద్ధి పేర్కొనడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యాఖ్యలతో నెటిజన్లు ఇద్దరి మధ్య ఏదైనా ప్రత్యేక బంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ, డేటింగ్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు.
కొందరు ఇది పూర్తిగా ప్రమోషనల్ స్టంట్ కావచ్చని అభిప్రాయపడుతుండగా, మరికొందరు గతంలో కూడా ప్రభాస్‌కు అనుష్క శెట్టి, కృతి సనన్‌లతో ఇలాంటి లింక్ వార్తలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో అవన్నీ నిరాధారమైన పుకార్లేనని సంబంధిత హీరోయిన్లు ఖండించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిద్ధి కుమార్ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో ‘ది రాజా సాబ్’ సినిమాకు మరింత పబ్లిసిటీ లభిస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.