ప్రభాస్ హీరోగా నటించిన ‘బిల్లా’ సినిమా 4కె వెర్షన్లో ఈ నెల 23న మళ్లీ విడుదల కానుంది. రీ రిలీజ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్‌కు అందిస్తామని దివంగత రెబల్‌స్టార్ కృష్ణంరాజు కూతురు ప్రసీధ తెలిపారు. ‘బిల్లా’ రీ రిలీజ్ కార్యక్రమాన్ని శనివారం హైదారాబాద్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు మెహర్ రమేష్, సంగీత దర్శకుడు మణిశర్మ, నటులు సుబ్బరాజు, అలీ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ప్రసీధ మాట్లాడుతూ ‘మా కుటుంబానికి ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. గోపీకృష్ణా మూవీస్‌లో నాన్నగారు, అన్నయ్య కలిసి నటించారు. నాన్న కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన మూవీ ఇది. అన్నయ్య ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా 4కె వెర్షన్లో విడుదల చేస్తున్నాం. ఈ మూవీ ద్వారా వచ్చిన వసూళ్లను నాన్న భాగస్వామిగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్‌కు అందిస్తాం’ అన్నారు.