ప్రభాస్ కథానాయకుడిగా ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ 25వ సినిమా ఇది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తాయి. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రకటన వెలువడింది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్‌కుమార్. ‘వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకెళ్తాం. ఇందులో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఆయన కెరీర్లో తొలిసారి పోలీస్ క్యారెక్టర్ చేయడం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’ అని చెప్పారు. భాషాభేదాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ ఇదని భూషణ్‌కుమార్ తెలిపారు. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ను ఈ సంక్రాంతికి ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ చిత్ర విడుదలను వాయిదా వేసే అవకాశముందని చెబుతున్నారు. కొద్దిరోజుల్లో ఈ విషయంపై స్పష్టతరానుంది.