ప్రభాస్ కథానాయకుడిగా భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. సీత పాత్రను కృతిసనన్ పోషిస్తున్నది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించారు. అజయ్-అతుల్ స్వరపరిచారు. ‘జై శ్రీరామ్ జైశ్రీరామ్ రాజా రామ్…నీ సాయం సదా మేమున్నాం. సదా సిద్ధం సర్వసైన్యం. సహచరులై సహా వస్తున్నాం. సఫలం స్వామికార్యం. మహిమాన్విత మంత్రం నీ నామం’ అంటూ రాముడి గుణగణాల్ని తెలియజేస్తూ ఈ పాట సాగింది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్సేన్, సోనాల్‌చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.