హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. తాజాగా చిత్రబృందం అదే టైటిల్ను ఖరారు చేసింది. గురువారం ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. 1940ల నాటి ఈ కథలో బ్రిటీష్ వారిపై పోరాడిన సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు., ‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు, గురువులేని ఏకలవ్యుడు, పుట్టుకతోనే అతను యోధుడు, మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది.
అతడే ‘ఫౌజీ’ అంటూ చిత్రబృందం సోషల్మీడియాలో ఓ పోస్టర్ను పంచుకుంది. ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
‘ది రాజాసాబ్’ న్యూపోస్టర్: గురువారం ప్రభాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.