Kalki 2898 | సోమవారం విడుదలైన ‘కల్కి 2898’ సినిమా ట్రైలర్ ద్వారా దర్శకుడు నాగ్అశ్విన్ మూడు నిమిషాల పాటు కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుంది? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా ఈ ట్రైలర్ ఉంది. ‘సృష్టిని కాపాడాలంటే.. ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలి’ అంటూ అశ్వత్థామగా అమితాబ్ ప్రవర్తన ఆ ట్రైలర్లో చూడొచ్చు. ఇందులో నిండు చూలాలైన తల్లిగా దీపిక పదుకొనే కనిపించింది. ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఎవరు? ఆ బిడ్డేనా ‘కల్కి’?.. అంటే.. ఇందులో ప్రభాస్‌కి తల్లిగా దీపిక పదుకొనే నటించిందా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యేలా ట్రైలర్ ఉంది. ‘ఈ సృష్టిలో తొలి నగరం కాశీ.. చివరి నగరం కూడా కాశీనే’ అని సృష్టి అంతం గురించి చెబుతూ పునరుజ్జీవాన్ని కూడా చూపించారు.
‘ఆరువేల సంవత్సరాల క్రితం నాటి పవర్ మళ్లీ కనిపించింది.. అంటే ఇక వెలుగు వచ్చే సమయం ఆసన్నమైంది..’ అని రాజేంద్రప్రసాద్ పాత్ర చెప్పడం ‘కల్కి 2898’ ఆగమనం గురించే అని అర్థమవుతుంది. చివరగా కమల్‌హాసన్ వింతరూపంలో కనిపించి ‘భయపడకు.. మరోప్రపంచం వస్తుంది..’ అంటూ షాక్ ఇచ్చారు. ‘అశ్వత్థామ పోరాటాలు, ‘కల్కి’ సాహసాలు.. హాలీవుడ్‌ను తలదన్నే అద్భుతమైన సాంకేతికత.. ఇవన్నీ ‘కల్కి 2898’ ట్రైలర్లో కనిపించాయి. దిషాపటానీ, రాజేంద్రప్రసాద్.. ఇంకా చాలామంది ఈ ట్రైలర్లో కనిపించారు. వైజయంతీమూవీస్ చరిత్రలోనే అత్యంత భారీగా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.