Kalki 2 | ఓ ఐదేళ్లపాటు మరో సినిమాను అంగీకరించలేనంత బిజీగా ఉన్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన డైరీ ఫుల్ అయిపోయింది. అందుకే గ్యాప్ దొరికితే షూటింగ్‌లు చేసేస్తున్నారు. కాసేపు ‘ది రాజాసాబ్’.. ఇంకాసేపు ‘ఫౌజీ’.. ఈ లిస్ట్‌లో త్వరలోనే ‘స్పిరిట్’ చేరనుంది. దీనికైతే సందీప్‌రెడ్డి వంగా ఏకంగా ఏడాదిపాటు బల్క్ డేట్లు అడిగినట్లు తెలుస్తున్నది. అంటే.. రాజాసాబ్, ఫౌజీ రెండింటినీ కంప్లీట్ చేసి కానీ ‘స్పిరిట్’ వైపు వెళ్లలేరు ప్రభాస్. సరే.. ఇంతకీ ‘కల్కి 2’ సంగతేంటి? ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 12వందలకోట్ల సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకూ ఇండియాలో రూపొందిన ఫ్రాంచైజీల్లో ఫస్ట్ పార్ట్‌కే 12కోట్లు రావడం కేవలం ‘కల్కి 2898ఏడీ’ విషయంలోనే జరిగింది.
దాంతో సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ‘కల్కి’ జోలికి పోవడం లేదు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చేస్తున్నారు. త్వరలో ‘స్పిరిట్’ సెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ‘కల్కి’ దర్శకుడు నాగ్అశ్విన్ ఏం చేస్తున్నారు? అంటే.. ఆయన కుటుంబంతో కలిసి ప్రస్తుతం విహార యాత్రల్లో ఉన్నారు. ఇటీవల కేరళలో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. ఆయన కనిపించగానే అభిమానులు చుట్టుముట్టి ‘కల్కి’ గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ‘వర్క్ స్టార్ట్ చేయాలి.. సెకండ్ పార్ట్‌కోసం తీసిన పుటేజ్ కొంత రెడీగా ఉంది.. త్వరలో పని మొదలుపెడతా..’ అన్నారు. ఏదేమైనా ఈ ఏడాది, వచ్చే ఏడాది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలకు సరిపోతాయి. సో.. ఇక ‘కల్కి-2’ 2027లోనే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.