Bhola Shankar | వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి అసలు ఆగడం లేదు. తన మార్కెట్ ఇంకా అలాగే ఉంది అని తెలుసుకున్న తర్వాత.. భోళా శంకర్ సినిమాలో చేయాల్సిన ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. మాస్ ఆడియన్స్ తో పాటు అభిమానులకు నచ్చే అంశాలు అందులో ఉండేలా చూసుకుంటున్నాడు మెగాస్టార్. మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. దీనిపై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు కాని వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో మెహర్ రమేశ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 8 సంవత్సరాల కింద తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు కథలో చాలా మార్పులు చేశాడు దర్శకుడు మెహర్ రమేశ్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మీద వస్తున్న కొన్ని గాసిప్స్ విని మెగా ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు.
అందులో మొదటిది చూడాలని ఉంది.. సినిమాలోని రామ్మా చిలకమ్మా పాటను భోళా శంకర్ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు అనేది. రెండు సినిమాల నేపథ్యం కలకత్తా కావడంతో కచ్చితంగా అది నిజమే అయి ఉంటుందని మెగా ఫాన్స్ భావిస్తున్నారు. అప్పటి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తే.. ఇప్పటి సినిమాకు ఆయన కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రెండోది ఈ సినిమాలో చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నాడని వార్తలు వినిపించడం. పైగా సినిమాలో ఖుషి నడుము సీన్ రీ క్రియేట్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఆనందం అసలు ఆపుకోలేకపోతున్నారు మెగా ఫాన్స్.
పవన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ సీన్స్ లో ఒకటిగా నిలిచిన ఖుషి నడుము సీన్ ను భోళా శంకర్ సినిమాలో చిరంజీవి, శ్రీముఖి మధ్య చిత్రీకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నువ్వు నా బొడ్డు చూశావ్ అంటూ శ్రీముఖి చిరంజీవితో అంటే.. అక్కడ చూడ్డానికి బొడ్డు ఎక్కడ ఉంది.. అన్ని మడతలే కదా అంటూ సెటైర్ వేసే సన్నివేశం సినిమాలో ఉంటుందని.. అది లొకేషన్లో బాగా పేలిందని.. రేపు థియేటర్స్‌లో కూడా ఆ సీనుకు అదిరిపోయే అప్లాజ్ వస్తుందని నమ్ముతున్నాడు దర్శకుడు మెహర్ రమేశ్. ఏదేమైనా మాస్ ప్రేక్షకుల కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడు మెగాస్టార్. బడ్జెట్ తక్కువే కావడంతో బిజినెస్ కూడా వీలైనంత వరకు తక్కువ చేయాలని చూస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.