e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home సినిమా విడుదల వాయిదా

విడుదల వాయిదా

విడుదల వాయిదా

గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మూలంగా తెలుగు చిత్రసీమ తీవ్రంగా నష్టపోయింది. తొమ్మిది నెలల పాటు షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఆరంభంలో సినీ పరిశ్రమలో తిరిగి సందడి మొదలైంది. కరోనా భయాలను వీడి సినిమాలు చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా?లేదా? అనే సందేహాల్ని పటాపంచలు చేస్తూ క్రాక్‌, జాతిరత్నాలుతో పాటు మరికొన్ని సినిమాలు అద్వితీయ విజయాల్ని సాధించి భవిష్యత్తుపై భరోసాను ఇచ్చాయి.

కరోనా కష్టాల్ని మరచిపోయి నూతనోత్సాహంతో దర్శకనిర్మాతలు తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఈ తరుణంలో సెకండ్‌వేవ్‌ రూపంలో మరో ఉపద్రవం సినీ పరిశ్రమలో కలవరపాటును కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతి పెరుగుతుండటంతో ఈ అనిశ్చితి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.

సెకండ్‌ వేవ్‌ మూలంగా ఇప్పటికే మహారాష్ట్రతో పాటు పలు రాష్ర్టాల్లో థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో వందశాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నా భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా దర్శకనిర్మాతలు తమ సినిమాల్ని వాయిదావేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏప్రిల్‌లో విడుదలకావాల్సిన యువ హీరోల సినిమాలు వాయిదాపడ్డాయి. వారి బాటలతోనే మరికొందరు అగ్ర కథానాయకులు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం ఏడాది కాలంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో పలు జాగ్రత్తల్ని తీసుకుంటూ షూటింగ్‌ను పూర్తిచేసిన చిత్రబృందం ఈ నెల 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అనూహ్యంగా కరోనా తీవ్రత పెరగడంతో వారి ఆశలు ఫలించలేదు. సినిమా రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేశారు. ‘గత పదిరోజుల్లో కరోనా వ్యాప్తి పెరిగింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని సినిమా విడుదలను వాయిదావేస్తున్నాం’ అని నిర్మాతలు ప్రకటించారు. త్వరలో మంచి డేట్‌ చూసుకొని విడుదలచేస్తామని వెల్లడించారు.

విడుదల వాయిదా

ఈ నెల 23న విడుదలకావాల్సిన నాని ‘టక్‌ జగదీష్‌’ చిత్రం కరోనా ఉధృతితో వెనక్కివెళ్లిపోయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ‘కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇది. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్‌ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రిలీజ్‌ డేట్‌ను మార్చుతున్నాం’ అని హీరో నాని ప్రకటించారు. షైన్‌ స్క్రీన్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించింది. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు.ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను కరోనా మహమ్మారి కారణంగా వాయిదావేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు అధికమవుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని పేర్కొన్నారు.

రానా, సాయిపల్లవి జంటగా రూపొందిన ‘విరాటపర్వం’ వాయిదా మార్గాన్నే అనుసరించింది. కోవిడ్‌-19 ఉధృతమవుతుండటంతో ఈ నెల 30న సినిమాను విడుదల చేయడం లేదని నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను వెల్లడిస్తామని తెలిపింది. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కరోనా ప్రభావంతో ఏప్రిల్‌లో విడుదలకావాల్సిన పెద్ద సినిమాలన్నీ ఇప్పటికే వెనక్కితగ్గాయి. ఈ నేపథ్యంలో మే నెలలో విడుదలకావాల్సిన అగ్ర హీరోల సినిమాల రిలీజ్‌లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెలలో చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేష్‌ ‘నారప్ప’, రవితేజ ‘ఖిలాడి’తో పాటు మరికొన్ని భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాలు వాయిదా పడే అవకాశమున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విడుదల వాయిదా

ట్రెండింగ్‌

Advertisement