Posani Krishna Murali | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన పోసాని కృష్ణమురళి చాలా రోజుల తర్వాత మరోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. గతంలో ‘ఆపరేషన్ దుర్యోధన’ శ్రావణమాసం, రాజవారి చేపల చేరువు, వంటి శక్తివంతమైన చిత్రాలకి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న పోసాని, ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించబోయే ఈ కొత్త చిత్రానికి ‘అరుణారెడ్డి’ లేదా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పోసాని గతంలో దర్శకత్వం వహించిన చిత్రాలు వాణిజ్యపరంగా విజయాలు సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా, 2007లో విడుదలైన ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సమస్యలను చర్చించి, ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆలోచింపజేసింది.
పోసాని కొత్త ప్రాజెక్ట్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ‘ఒసేయ్ రాములమ్మ’ తరహాలోనే ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. పోసాని మార్క్, సామాజిక సమస్యలతో కూడిన శక్తివంతమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.