Poonam Pandey | వివాదాలకు కేరాఫ్‌గా ఉండే బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరోమారు అభిమానులను షాక్‌కు గురిచేసింది. తన నకిలీ డెత్ స్టంట్ ప్రదర్శించి అందరూ నాలుక కరుచుకునేలా చేసింది. తాను చనిపోయినట్లు వ్యక్తిగత సిబ్బందితో శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టించారు పూనమ్. తీరా శనివారం ఉదయం పూనమ్ పాండే మళ్లీ ఇన్‌స్టా వేదికగా ప్రత్యక్షమైంది. తాను ఎక్కడికీ పోలేదని, బతికే ఉన్నానంటూ వీడియోలో మాట్లాడుతున్న పూనమ్‌ను చూస్తూ అందరూ నోరెళ్లబెట్టారు. ఇప్పుడు వారంతా ఆమె తీరుపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఆమె చేసిన మరో స్టంట్ అంటూ తిట్టిపోస్తున్నారు. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ నానాటికీ ప్రమాదకరంగా మారుతున్నదని, దానిపై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్లు పోస్ట్ పెట్టించానని వెల్లడించింది పూనమ్.
అయితే, స్వలాభం కోసం తాను చనిపోయినట్లు పోస్టు పెట్టిస్తే అది క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించినట్లు ఎలా అవుతుందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఉదయం పూనమ్ తాజా ఇన్‌స్టా పోస్టు ఇలా ఉంది.. ‘మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను ఎక్కడికీ వెళ్లలేదు. బతికే ఉన్నా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను ప్రాణాలు కోల్పోలేదు. కానీ, ఈ వ్యాధి ఇప్పటికే వేలాది మంది మహిళల ప్రాణాలు హరించింది. ఇది ఇతర క్యాన్సర్ల మాదిరిగా ప్రమాదకరం కాదు. దీన్ని నివారించడం సాధ్యమే. హెచ్‌పీవీ వ్యాక్సీన్ తీసుకోవడమో లేదా వ్యాధిని ముందస్తుగా గుర్తించడమో అవసరం. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు చాలా దారులున్నాయి. అందరికీ అవగాహన కల్పిద్దాం.
నిశబ్దంగా ప్రాణాలను హరిస్తున్న ఈ డిసీజ్ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే నా మరణ వార్తను వ్యాపింపజేశాను. ఈ వార్త అందరినీ ఇబ్బంది పెడుతుందని తెలుసు. అందుకు నన్ను క్షమించండి’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నది. ఏదైనా మంచిని చెప్పాలంటే మంచిగా చెప్పాలి కానీ, ఇలా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని మనిషి బతికి చెబితే ఇంతలా ప్రజల్లోకి చేరేది కాదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫ్లిన్ రెమెడియోస్ అనే జర్నలిస్ట్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టాలని ముంబయి పోలీసులను ఎక్స్ వేదికగా కోరారు.