టాలీవుడ్లో అందానికి సొంతూరు తానేనని నిరూపించుకుంది పూజా హెగ్డే. బడిలో, గుడిలో తన తలపే వచ్చేలా ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్లో పాగా వేయాలన్న కల మాత్రం ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ఫలించలేదు. బీటౌన్‌లో నాలుగో ప్రయత్నంగా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో సల్మాన్‌తో జట్టుకట్టిన పూజ హిందీ ప్రేక్షకులను ఈసారి ఆకట్టుకుంటానని నమ్మకంగా చెబుతున్నది. తాజాగా విడుదలైన ‘కిసీ కా..’ చిత్రంలో కథానాయికగా మంచిమార్కులే కొట్టేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్లో తన జర్నీ గురించి పూజ చెప్పిన సంగతులు…
సినిమాల్లోకి వచ్చింది మొదలుకొని హైదరాబాద్‌లోనే ఉండిపోవడంతో ఒకరకంగా నేను తెలుగు అమ్మాయిని అయిపోయాను. ‘కిసీ కా..’ సినిమాలో తెలుగింటి ఆడబిడ్డ పాత్ర పోషించాను. ఇందులో కథానాయిక పాత్ర పేరు భాగ్య. బిందాస్ అమ్మాయి. సరదాగా ఉంటుంది. భాగ్య నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర.
సినిమాలో వెంకటేశ్ సోదరిగా నటించాను. ఆయనతో కనిపించే సన్నివేశాలు కొన్ని తెలుగులోనే ఉన్నాయి. అవి షూట్ చేస్తున్నప్పుడు భలేగా అనిపించింది. భాష మీద పట్టు ఉండటంతో అప్పటికప్పుడు డైలాగ్స్‌ను ఇంప్రొవైజ్ చేసేదాన్ని కూడా!
సల్మాన్‌తో పనిచేయడం గొప్పగా అనిపించింది. నా మొదటి చిత్రం ‘మొహెంజోదారో’ సెట్స్‌కి ఆయన వచ్చారు. ‘మనం త్వరలోనే కలిసి పనిచేద్దాం’ అని అప్పుడు ఆయన అన్నమాట ఇన్నాళ్లకు ఇలా నెరవేరింది. ఆయన యాక్షన్‌తోపాటు కామెడీ టైమింగ్ కూడా సూపర్బ్. నాకూ కామెడీ అంటే చాలా ఇష్టం. హాస్యరసం పండించడం చాలా కష్టం. మోతాదులో ఏ మాత్రం తేడా వచ్చినా సీన్ పండదు.
గత ఏడాది జయాపజయాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ అని చెప్పొచ్చు. విజయ్‌తో చేసిన ‘బీస్ట్’ తమిళంలో మంచి వసూళ్లను రాబట్టింది. అందులోని ‘అరబిక్ కుతు’ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమా చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచించను. పనికి వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించాను. భారీ సక్సెస్‌లు చూశాను. ఫెయిల్యూర్స్ కూడా పలకరించాయి. బ్లాక్‌బస్టర్ అవ్వాలని కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ పోలేం కదా! ప్రేక్షకులకు కొత్తదనం పంచడానికి అప్పుడప్పుడూ కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తుంటాను. వాటి ఫలితం ఎలా ఉన్నా.. నటిగా నాకు గుర్తింపు తెచ్చాయి!