Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా గేమ్ ఛేంజర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకులకి అదిరిపోయే ఎంటర్టైన్ అందించాలనే కసితో ఉన్నాడు చెర్రీ. పెద్ది చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. పెద్ది చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు 30% పూర్తయిందని రామ్ చరణ్ లండన్‌లో జరిగిన ఈవెంట్లో చెప్పుకొచ్చారు. రంగస్థలం కంటే పెద్ది మూవీ భారీగా ఉంటుందని చెప్పి సినిమాపై మరింత అంచనాలు పెంచారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. ఇందులో ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ వీడియోలో మాస్ అవతార్ లో చరణ్ లుక్ ప్రేక్షకులకు కన్నుల పండగగా అనిపించింది. “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.” అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో చరణ్ ఆటకూలీగా కనిపించనున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ లో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే చరణ్ తో కలిసి స్టెప్పులేయనుందని తాజా సమాచారం. మొన్నటి వరకు శ్రీలీల అని ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు పూజా హెగ్డే అంటున్నారు. రంగస్థలంలో పూజా .. జిగేలు రాణిగా అదరగొట్టగా ఇప్పుడు పెద్దిలో రచ్చ చేసేందుకు సిద్ధమైందని అంటున్నారు. చూడాలి మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో.