అగ్ర కథానాయిక పూజాహెగ్డే గత కొంతకాలంగా సరైన విజయాలు లేక రేసులో పూర్తిగా వెనకబడిపోయింది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేస్తున్నది. తాజా సమచారం ప్రకారం హీరో, దర్శకుడు లారెన్స్ సరసన ఓ చిత్రంలో ఈ అందాలభామ నటించబోతున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే… రాఘవ లారెన్స్ హీరోగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్, పూజాహెగ్డే, రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
ఇప్పటికే ఈ విషయంలో చిత్రబృందం ఆమెను సంప్రదించిందని, కథ నచ్చడంతో పూజాహెగ్డే సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పూజాహెగ్డే తమిళంలో సూర్య 44వ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. తాజా అవకాశాలతో ఇండస్ట్రీలో తాను తిరిగి పూర్వవైభవాన్ని సాధిస్తాననే నమ్మకంతో ఉంది పూజాహెగ్డే.