Naga Chaitanya | స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గతేడాది కస్టడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అతడి ఆశలన్ని తండేల్ చిత్రంపైనే ఉన్నాయి. కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం నాగ చైతన్య విరుపాక్ష దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
సాయి ధరమ్ తేజ్‌కి విరుపాక్ష లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దర్శకత్వంలో చైతూ ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోనున్నారని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు 10 ఏండ్ల తర్వాత వీరిద్దరి మళ్లి కలిసి నటించనున్నారు. ఇంతకుముందు వీరిద్దరు కలిసి ‘ఒక లైలా కోసం’ అనే సినిమా చేశారు. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది.