Pooja Hegde | నాయికగా అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది అందాల తార పూజా హెగ్డే. గతేడాది వరుస అపజయాలు ఎదురైనా స్థిరంగా కెరీర్ మీద దృష్టి సారిస్తున్నది. ప్రస్తుతం తను చేస్తున్న రెండు భారీ చిత్రాలపై పూజా ఆశలు పెట్టుకుంది. మహేశ్ బాబు సరసన నటిస్తున్న కొత్త సినిమాతో పాటు సల్మాన్‌కు జోడీగా కనిపించనున్న కిసీ కా భాయ్ కిసి కి జాన్ చిత్రాలు ఇకపై పూజా కెరీర్‌ను నిర్ణయించబోతున్నాయి. అయితే ప్రతి సినిమాకు కష్టపడి పనిచేస్తామని, దాని ఫలితం నిర్ణయించలేమని అంటున్నదీ నాయిక. వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కడమే తనకు సంతృప్తినిస్తుందని చెప్పుకుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ…‘నేనెలా కనిపిస్తాను అనే దానికంటే నా పాత్రకు తగినట్లు ఉండేందుకు ప్రయత్నించాను. నేను పక్కింటి అమ్మాయిలా కనిపించగలను. ఆధునిక యువతిగా మెప్పించగలను. ఒక టీచర్‌గా, చారిత్రక నేపథ్య మహిళగా నటించగలను. భిన్నమైన ఈ పాత్రలన్నీ నటిగా నాలోని వెర్సటాలిటీని చూపించాయి. నాలో దైవభక్తి ఎక్కువగా లేదు గానీ మనల్ని ఏదో బలమైన శక్తి నడిపిస్తుందని నమ్ముతుంటా.’ అని చెప్పింది.