Pooja Hegde | ‘అందచందాల ఆవిష్కరణకే పెద్ద పీట వేసే ఈ గ్లామర్ ఫీల్డ్‌లో అభినయానికి ఆస్కారమున్న పాత్రలు దొరకడం అరుదు. ఎప్పుడో సడెన్‌గా అలాంటి పాత్రలు తలుపు తడతాయి. అలాంటి పాత్రనే ‘సూర్య44’(వర్కింగ్ టైటిల్)లో చేశాను. ఇప్పటివరకు నా కెరీర్లో ది బెస్ట్ కేరక్టర్ ఇదే అని ఘంటాపథంగా చెప్పగలను’ అంటున్నది అందాలభామ పూజా హెగ్డే.
ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా ఉన్నది. తాను చేస్తున్న సినిమాల్లో ‘సూర్య 44’ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని తన పాత్ర గురించి ఇటీవల చెన్నైలో మాట్లాడింది పూజా హెగ్డే. ‘ప్రేమ, యుద్ధం, నవ్వు.. ఈ మూడింటి చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు.
ఈ కథకు నా పాత్ర వెన్నెముక. సూర్య లాంటి సూపర్‌స్టార్ నటిస్తున్న చిత్రంలో ఇంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడం నిజంగా అదృష్టమే. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. అందరితోపాటు నేనూ ఈ సినిమాకోసం ఎదురు చూస్తున్నాను’ అని తెలిపింది పూజా హెగ్డే. ఈ సినిమాతోపాటు బాలీవుడ్లో ‘దేవా’ అనే సినిమా, అలాగే వరుణ్‌ధావన్ జోడీగా మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నది పూజా హెగ్డే.