Pooja Hegde | అగ్ర కథానాయిక పూజాహెగ్డే ప్రస్తుతం ‘రెట్రో’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోషల్‌మీడియా గురించి పూజాహెగ్డే ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని, అంతమాత్రాన వారందరూ టికెట్లు కొని సినిమాలు చూస్తారని గ్యారంటీ ఇవ్వలేం కదా అని వ్యాఖ్యానించింది.
‘సోషల్‌మీడియా చాలా భిన్నమైన ప్రపంచం. ఏది నిజమో నిర్ధారణ చేసుకోలేం. కొంతమంది తారలకు 50లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. కానీ బాక్సాఫీస్ వద్ద వాళ్ల సినిమాలకు మంచి వసూళ్లు లభిస్తాయి. అందుకే వృత్తిపట్ల అంకితభావంతో ఉంటూ బయటి వారి నుంచి సినిమా తాలూకు ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి’ అని పూజా హెగ్డే చెప్పింది. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్‌గా మారాయి. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా ‘రెట్రో’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సూర్య గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా నిర్మాణంలో సూర్య భాగస్వామిగా ఉన్నారు.